శ్రీ శ్రీ శ్రీ ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారు (శ్రీ వాసుదాసు స్వామి గారు) కారణజన్ములు, పరమ పురుషులు శ్రీ స్వామి వారు 23-1-1863 దుందుబి నామ సంవత్సరము మాఘ మాసము శుక్ల చతుర్ధి శుక్రవారము నాడు శ్రీమతి కనకమ్మ, శ్రీ రామ చంద్ర రావు పుణ్యదంపతులకు కడప జిల్లా జమ్మలమడుగు గ్రామమున జన్మించిరి. ఈ పూత చరిత్రుని గన్న తల్లి సాక్షాత్ లక్ష్మియే, “ హిరణ్యయిం లక్ష్మీం ” అనుట నిజము ఆయన తండ్రి శ్రీ రామచంద్ర రావు గారు రామ చంద్రులే.

            శ్రీ స్వామి వారు పసి బాలుర నుండి పరమ యోగులు వరకును అందరికి ఉపయోగమగునట్లు ఆంధ్ర బాష యందు శతాధిక గ్రంధములు రచించిరి శ్రీ స్వామి వారి భాషాసేవ, లోక సేవ, దేవ సేవ లోక విదితము, వాల్మీకి రామాయణము మూలము నందు గల 24 వేల సంస్కృత శ్లోకములను తెలుగులో “ శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణము ” అను పేర 24 వేల పద్యములుగా రచించి 1908 సంవత్సరము అక్టోబరు నెల 9, 10, 11 తేదీలకు సరియైన కీలక నామ సంవత్సరము ఆశ్వీయుజ పౌర్ణమి మరియు బహుళ పాడ్యమి, విదియలందు శ్రీ మదొంటిమిట్ట కోదండరామ స్వాముల వారికి సమర్పణము గావించిరి.

            శ్రీ వాసుదాసు స్వామి వారు ఒంటిమిట్టకు వేంచేయక ముందు ఆ గ్రామమునకు వచ్చు నతిధి అభ్యాగతులకొక పిడికెడు మెతుకులు గాని ఒక గ్రుక్కెడు నీళ్ళు గాని ఇచ్చువారా గ్రామమున నొకరైనను లేకుండిరి. ఆ విషయము శ్రీ స్వామి వారు గమనించిన శ్రీ రామ సేవా కుటీరము నిర్మించి అతిధి అభ్యాగతులకు నాదరువు గల్పించిరి. విదేశపు బైరాగులకు సదా వృత్తి నొసగి యాదరించిరి, జీర్ణమయి ఉన్న శ్రీ రాముని కోవెల పునరుద్ధరించిరి, శ్రీ సంజీవరాయుని దేవాలయమునకు విమాన గోపురము గట్టించిరి. శ్రీ కోదండరామ ప్రభువునకు నిత్య భోగ కల్పనము గావించిరి. నిత్యోత్సవముల నేర్పాటు చేసిరి, రథము చేయించిరి, రథ శాల నిర్మించిరి. శృంగి శైలము పై శ్రీ వాల్మీకాశ్రామము గట్టించిరి.

శ్రీ వావిలి కొలను సుబ్బరావు (వాసుదాసు) గారి వాఙ్మయ ప్రశంస
శ్రీ రామాయణము - ఆదర్శ జీవితము
భారతము - నిత్య జీవితము
భాగవతము - దివ్య జీవితము
భగవద్గీత - మోక్షప్రదాయకము

శ్రీ రామాయణం లో ఆయా సన్నివేశాలలో భారత, భాగవత, భగవద్గీతల విషయాలను ఎట్లు సమన్వయము చేసికోవలెనో నిరూపించిన మహనీయుడు శ్రీ వాసుదాసు గారు.

వాసుదాసు గారి పద్యములను చెప్పకుండా కథాసరళిని సాగించే హరిదాసులు బహుశః ఉండరు. హైదరాబాదు, కడప, మద్రాసు, మున్నగు చోట్ల ఎక్కువ ప్రచారమునొoదినవి వీరి పద్యములే. వీరు రచించిన రామాయణ వ్యాఖ్యకు మందరమని పేరు. ఆ వ్యాఖ్య లోని విశేషములను కoఠస్థము చేసి తాము చెప్పెడి హరికథలలో సందర్భోచితముగా ఉపయోగించుకొనుచు హరిదాసులు నేటికిని కీర్తి గౌరవములను పొందుచున్నారు.

దాసు గారు శతాధిక గ్రంథ రచనలు చేశారు. కుమారాభ్యుదయము- కౌసల్యాపరిణయము- ద్విపదకావ్యముగా భగవద్గీత- శ్రీకృష్ణ లీలామృతము- శ్రీకృష్ణావతారతత్వము- సుభద్రావిజయము మున్నగునవే కాక ఇంకను చాల ఉన్నవి. చాలామంది ఉపన్యాసకులు వీరి రచనలలోని విశేషాoశములను గ్రహించి వివరించుచు నేటికిని తమ ప్రవచనములను కొనసాగించుచున్నారు.

వీరి పద్యరచన ప్రత్యేకత ఏమనగా బాలకాండ, అయోధ్యకాండ, సుందరకాండ, చదివినచో చక్కని కవితాధోరణి మనకు ప్రాప్తింప కలదు. అట్లే పోతన భాగవతములోని సప్తమ, దశమ, స్కంధములను పారాయణ చేయుచున్నచో అద్భుతమైన కవితాశక్తిని పొంది సుకవులు అయిన వారు నాకు తెలిసి చాలమంది ఉన్నారు. నన్నయ గారి భారత ఆది పర్వ రచనకు కూడా ఈ శక్తికలదని పెద్దలు అందురు. వీరిలో కొందరు అష్టావధాన, శతావధాన ప్రక్రియలలో కూడా నిష్ణాతులైన వారున్నారు.

వాల్మీకి కులము, పేరు, జీవితములను గురించి చాల మంది పరిశోధకులు కవులు మున్నగు వారు తమకు అందిన, తాము ఊహిoచిన విషయములను బట్టి నిర్ణయించారు. దాసు గారు వాల్మీకి శబ్ద ఔచిత్యము, వాల్మీకిగా మారుటకు ముందు గల జీవితము మున్నగు విశేషాoశములతో బాల కాండ లోనే అద్బుతముగా మనకు సప్రమాణముగా అందించారు. ఇట్లే భాగవతమ౦దలి విషయములకు తోడుగా నారదుని గురించి కూడా చాల వివరించిరి.

“పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట” అని కర్తృత్వ భోక్తృత్వముల రెంటిని ఆశిoపక కేవలం మోక్షాపేక్షతో మహా కవి పోతన మహాభాగవత రచన సాగించినట్లు దాసు గారు కూడా దేనిని ఆశిoపక రామాయణ వ్యాఖ్యను తన 70 సంవత్సరముల వయస్సులో ప్రారంభించినట్లు స్వయముగా తానే చెప్పుకున్నాడు.

దాసుగారికి క్షయవ్యాధి ఉన్నది దేహబలము లేదు రచనలు చేయుటకు తగిన శక్తియులేదు. నేటికాలమున ఉన్నట్లు ఒంటిమిట్టకు రైళ్ళుగాని బస్సులుగాని ఇతర వాహన సదుపాయములు ఆ కాలమున లేనే లేవు. క్రూరమృగసంచారమెక్కువ చుట్టును కొండలు, ఆహారవసతి లేదు. ఇన్ని ఇబ్బందులమధ్య రచనలుసాగించుట మిక్కిలి కష్టతరమైనది. బమ్మెర పోతన ఆ కోదండరామునే నమ్ముకుని తన రచనలను అంకితమిచ్చి తన జన్మను సఫలతనొoదించికున్నట్లు దాసుగారు కూడా తన శరీరబాధలు ఆకలిదప్పికలు అనారోగ్యస్థితి, మరణభయము, నిస్సహాయస్థితిని లెక్కింపక ప్రగాఢవిశ్వాసముతో కోదండరామునే నమ్ముకొనెను తనకు శక్తిని ఇచ్చికాపాడి తన రచనలను పూర్తిచేయించి తనను తరిoపచేయవలసినదిగా మ్రొక్కుకున్నట్లు స్వయముగా తానే వ్రాసికొన్నారు. మనకు ఎంత దైవభక్తి ఉన్నను వారున్నస్థితిలో మనము ఉండి రచనలను చేయలేముకదా! ఏపరిస్థితిలోను తనరచనాయజ్ఞమును విడువక కొనసాగించి కాలమును గడిపినవాడు. దైవమునేనమ్ముకున్నవానికి ఏ పరిస్థితిలోను ఓటమి ఉండదని వాసుదాసుగారు మనకు నిరూపించిరి.

మరణకాలముఎవరికైనను ఎట్లుండునో తెలియదుకదా! కానీ ఆ స్థితి ఎవరికైనను తప్పదు. దానిని మనసునఎల్లవేళల భావించుచు చాల జాగ్రత్తగా ప్రతిక్షణము మనము ఎట్లుoడవలెనో స్వామివారు చక్కగావివరించి మనలను హెచ్చరించారు.

“ఆచారః ప్రభవో ధర్మః – ధర్మస్య ప్రభురచ్యుతః – ధర్మాత్ఆయుర్వివర్ధతే” - ఆచారమనగా వేదవిరుద్ధముకానిది, ఇతరులకు మేలు చేయకలిగినది, పెద్దలాచారించిచూపినది, తనను ఉద్ధరింపశక్తి గల నడవడిక.

“ఆగమానాంచసర్వేషాం ఆచారః శ్రేష్ఠఉచ్యతే”- అనగా అన్ని వేదములలో ఆచారమే శ్రేష్ఠమైనదని నొక్కి చెప్పబడినది.

శ్రీరాముని స్వానుష్టాననిష్థయే ధర్మమును నిరూపించినదికనుక శ్రీరామునిది అనుష్ట్టాన అవతారము. మాయామానుషవిగ్రహుడైనాడు. శ్రీకృష్ణునిది ఉపదేశావతారము- లీలామానుషవిగ్రహుడైనాడు.

ధర్మము సామాన్యమని, విశేషమని రెండు విధములు. సామాన్యముగా జనులు సామాన్య ధర్మమును పాటింతురు. ముముక్షువులు, జ్ఞానాధికులు, భగవద్ధర్మనిష్టులు అనుసరించేది విశేషధర్మము. సత్యమునే పలుకవలెను అనుట సామాన్య ధర్మము. దీనిని దాటి భగవత్పరతంత్రుడై వసుదేవుడు మెలగిన తీరు విశేషధర్మము. అట్లే ప్రహ్లాదునిది కూడ విశేషధర్మమే. ఈ ధర్మనిష్ఠమీదనే రామాయణమనే బండి సత్యమార్గమున సులభముగా ప్రయాణము చేసినది.

రామకథ ఇట్లు జరుగగలదని ముందే తెలిసికొని రామాదుల జన్మలకు ముందే శ్రీరామాయణము మహర్షి రచించెనని ఇప్పటికిని కొందరు ఏవేవో ఆధారములను చూపుచు చెప్పుచున్నారు. ఇది సరియిన పద్ధతి కాదు అని దాసుగారు చెప్పిరి. శ్రీరాముడు రాజ్యపాలనము చేయొచున్న కాలమునందే వాల్మీకి మహర్షి బోయవానిని శపించుట, చింతాక్రాoతుడై ఉండుట, బ్రహ్మయు నారదుడును వచ్చి రామకథను మహర్షికి బోధించి యోగదృష్టిని ఇచ్చి, యధార్ధమును తోచునట్లుచేసి అనుగ్రహించినట్లు రామాయణమే స్పష్టపరచుచున్నది కనుక రామాదుల జననమునకు పూర్వమే రామాయణకథ మహర్షికి తెలియదు. శ్రీరాముడు రాజ్యపాలన చేయు సమయమున అంతవరకు జరిగిన రామకథను బ్రహ్మానుగ్రహము వలన అతిశయోక్తులు, అసత్యములు, మున్నగునవి లేకుండా యధార్ధముగా జరిగినదానిని మహర్షి వ్రాసినందున రామాదుల జననముకు ముందే వాల్మీకి రచించెనని చెప్పుట సమంజసము కాదు. రాముని పట్టాభిషేకానoతరము లవకుశుల కథ, మనుష్యత్వమును వీడి రామాదులు దైవత్వమునొoదుట వరకు గల కథను భవిష్యద్దృష్టిచే మహర్షి వీక్షించి ముందే వ్రాసి ఉంచెను. కనుక లోకమున ఉన్న వితండవాదములకు, కుతర్కములకు చోటు లేకుండునట్లు వాసుదాసుగారు రామాయణమునే ప్రమాణముగా చూపుచు ఈ వాదమున నిజమును నిరూపించి రామాయణ పవిత్రతను కాపాడెను. నిజమును నిర్ధారించెను.

ఇక ఏ అపోహలకును తావు లేకుండా చేసెను. అరణ్యవాసమున చిత్రకూటమున రాముడు వాల్మీకిని దర్శించెను. వాల్మీకి వారిని ఆదరించెను. అప్పటికి రామకథ మహర్షికి తెలియనట్లుగానే భావించవలెను. ఈ సంఘటనలనుబట్టి రామకథ పట్టాభిషేకానంతరమే వాల్మీకికి తెలిసినట్లు స్పష్టమగుచున్నది.

రామాయణకథకు మానిషాద అనుశ్లోకము ఎట్లు మూలమై కథాభాగమునంతటిని సూచించినదో దాసుగారి ప్రారంభపద్యము కూడా కథాభాగమoదలి రహస్య పరమార్ధవిషయములను తెలియజేయుచున్నది. ఈ రచనము దాసుగారికి కేవలము దైవానుగ్రహబలముతో కలిగినదేకాని వేరు కాదు.

రామాయణకథను కొన్ని వందలమంది కవులు వ్రాసిఉన్నారు. వ్యాఖ్యానములుకూడ అనేకములున్నవి. క్రొత్తగా చెప్పెదేమిటి అను ప్రశ్న ఇప్పటికి కొంత వింత అయి ఉన్నది. వారి వారి సంస్కారము, అనుష్టానము, బుద్ధిబలము, రచనాసామర్ధ్యములనుబట్టి వారు ప్రయాణము చేసిరి. దీనివలన చాలవరకు తమిళము, మహారాష్ట్రము, హిందీ మున్నగు భాషలలోని విషయములు ప్రవేశిoచినవి. రామాయణములు కూడ సంస్కృతములో అనేకములు ఉన్నవి. అన్నింటికీ మూలము మాత్రము వాల్మీకి రామాయణమే. కానీ ఆయన భావములను గుర్తెరిగి జరిగిన రచనలు సంగ్రహములై కొద్దిగానున్నవి. దీనివలన రామాయణ నిజస్వరూపము, విశేషార్ధములు, అంతరార్ధములు, రహస్యార్ధములు మరుగునపడి పరమార్ధసాధనప్రయోజనము దారి తప్పినది. దీనిని చక్కగా గమనించి దాసుగారు సందర్భోచితముగా ఆ వివరములన్నిoటిని అందరికి తెలియుటకై తానుచేసిన ఆంధ్రరచనకు తానే వ్యాఖ్యాతయై క్షీరసాగరమథన సమయమున అమృతము పుట్టుటకు మoదరపర్వతము కారణమైనట్లు తన వ్యాఖ్యానమునకు మందరమను పేరు పెట్టి పండితపామరులను మెప్పించి జగత్ప్రసిద్ధినొందిరి.

రామాయణము ప్రణవస్వరూపము. ఓమ్ కారమే ప్రణవము. గాయత్రీమంత్ర విలసితమైనది. ఆ మంత్రము 24 అక్షరముల స్వరూపము కలిగియున్నది. సకలచరాచరసృష్టి, ముక్కోటిదేవతాస్వరూపములు దాని లోనే ఇమిడి ఉన్నవి. కనుకనే వాల్మికి 24 వేల శ్లోకములుగల రామాయణరచన చేసెను. వాసుదాసు గారు కూడ 24 వేల పద్యములనే వ్రాసిరి. నేటి రామాయణప్రతులలో 24 వేల సంఖ్యను దాటిన శ్లోకములు ఉన్నవి. తాటిఆకు ప్రతులను కొన్ని ప్రాంతములలోని అచ్చుప్రతులను చక్కగా పరిశీలించి పరిశోధకులు 24 వేలు అనియే నిజనిర్ధారణ చేసిరి.

గాయత్రీమంత్రమును మించినది ఏదియులేదు. సృష్టిలోని సకలమంత్రములును దానినుండే పుట్టినవి. అనులోమ, విలోమ పద్ధతిగల మంత్రానుష్టానబలమే విశ్వామిత్రుని అనుగ్రహమువలన రామాదులకు లభించినది. సకల అస్త్రప్రయోగములు, ఉపసంహారములు, బల అతిబల విద్యలు, ఇవే కాక ఏ విద్యలైనను గాయత్రినుండే వచ్చినవి. ఇవి ఆచారాలు, సంప్రదాయాలు, గురువులు, శిష్యులు, ఆ నాటి బుద్ధిబలము మున్నగు వాని వలన ద్వాపరయుగము వరకు కొంత ఫలించినవి. ఇప్పుడు సంప్రదాయ, ఆచారాదులు శౌచశీలములు పవిత్రములుగా లేవు కనుక ఆ బీజాక్షరశక్తి ఫలింపలేక మనకును ఆ నాటి ఫలితములను అందిoపలేని పరిస్థితి ఏర్పడినది. ఏ ఉపాయము చేతను ఫలిoపవు. కాదని ఇష్టారీతి గా ప్రవర్తించినచో వినాశనము తప్పదు. కనుకనే మంత్రానుష్ట్టానుమలవైపు ఎక్కువగా మనసును పోనీక స్మరణ భక్తిని అవలంబించుట ఉత్తమోత్తమము. దానివలననే ఈ కలియుగమన మోక్షము కలుగును.

పుస్తకాలుచూచి చదివేవి మంత్రాలుకావు గురుశుశ్రూష చేసి ఆయన చెప్పిన మంత్రమును ఉదాత్త, అనుదాత్త స్వరితములతో పలుకుటను నేర్చి అనుష్టించేదే మంత్రమగును. ఈ స్వరములలో ఏది తప్పినను మంత్రశక్తి ఫలిoపదు. రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు నికుమ్భిలాదేవతారాధనలో మంత్రమును స్వరహీనము చేసి నాశనమగుటను రామాయణమే స్పష్టము చేయుచున్నది. మంత్రమునకు స్వరము ముఖ్యము. ఉచ్చారణ కూడా ముఖ్యమైనదే. నామస్మరణమునకు ఏ నియమము లేదు. ఎవరైనను ఎప్పుడైనను చేసే సౌకర్యము ఉన్నది.

వాల్మీకి రామాయణము 24 వేల శ్లోకములు గలదానిని పారాయణము చేయలేని వారు ప్రతిదినము సంక్షేప రామాయణము( దీనినే బాలరామాయణమందురు) గాయత్రీ రామాయణమును పఠిoచినచో ఇష్టసిద్ధి తథ్యము. కనుకనే రామాయణ పారాయణమునకు అంతశక్తి ఉన్నందునే అందరిని ఉద్ధరింపజేయకలుగుతున్నది. దీనిని చదువుటకు, చెప్పుటకు, వినుటకు, వ్రాయుటకు, జాతి మత వర్ణ వయో వివక్షత లేక ప్రతి మనుష్యప్రాణికి అధికారము కలదని వాసుదాసుగారు నిరూపించిరి. మానవేతరప్రాణులకు అట్టి అవకాశమే లేదు కదా!

శరణాగతి, నమస్కారపద్ధతి, ప్రదక్షిణవిధి మున్నగువానిని గూర్చిన వివరములు ప్రతి కాండములోను చాల విధముల విపులీకరించి రామాయణమునే ప్రమాణముగా దాసుగారు చూపిరి.

వాల్మీకి రామాయణము సంస్కృత భాషా విలసితము. అందరికి సులభముగా అర్ధమగుట ఈ కాలమున కొంత కష్టమే. ఏ కాలము వారికైనను చదువుకొనెడి యోగ్యతను కలిగించే విధముగా సులభతర శైలిలో తెలుగులో దాసుగారు మనకందించిన రామాయణము అమృతఫలమే అగుచున్నది.

రామాయణము నవరసభరితము ఆయాసన్నివేశములను బట్టి ఆయా రసములు పోషిoపబడినవి. నా దృష్టిలో ఇదొక గొప్ప అపరాధపరిశోధక గ్రంథము. అనగా నేటి డిటెక్టివ్ పరిశోధనల పుస్తకము వంటిది. సీతారాముల ఎడబాటు, సీతజాడ తెలియక రామలక్ష్మణులు పడిన అవస్థలు, జటాయు సుగ్రీవాది సమాగామమువలన సీతను కొనుగొనుటకై కొన్ని మార్గములు రామాదులకు తెలియుట, హనుమ సముద్రమును దాటునప్పుడు కలిగిన ఆటంకములు, లంకలో సీతాన్వేషణము, రామకార్యసిద్ధికై హనుమ పడిన ప్రయాస, హనుమ యొక్క సమయోచిత బుద్ధి వైభవము ఇత్యాది విషయములన్నియు రాముడు సీతతోచేరి పట్టాభిషిక్తుడగునంతవరకు కథాభాగమoతయు ఎప్పటికప్పుడు ఉత్కoఠను కలిగించుచున్నది. నిష్ప్రయోజనమైన, పరమార్ధమునకు దూరమైన, పాపహేతువైన అనేక విధముల చెడు మార్గమునకు దారిచూపగల నేటి అపరాధ పరిశోధక గ్రంథములవలన సమాజమే నాశనమగుచున్నది. రామాయణకథ అట్టిది కాక తీవ్ర సమస్యలను కూడ ఎదుర్కొనెడి సమయస్పూర్తిని కలిగించుచు అందరికిని ఆదర్శమై తరింపచేయుచు దైవసాన్నిధ్యమును ప్రాప్తింపజేయుచున్నది.

మా అమ్మ గారు మీనాక్షమ్మగారు. తండ్రి రామకృష్ణయ్య గొప్ప రామభక్తుడు సంగీతవిద్వాంసుడు, ఆదర్శ ఉపాధ్యాయుడు. ప్రాచీన నాటక సమాజములలో నారద, సుదేవ, అశ్వద్ధామ పాత్రలను నటించి అనేక నాటక కళాపరిషత్తులలో బంగారు పతకములు గెలుచుకొన్న వ్యక్తి.

పిన తండ్రులు లక్ష్మీనారాయణయ్య, బలరామమూర్తి గారలు. లక్ష్మీనారాయణయ్య శ్రీకృష్ణ భక్తుడు, హరిదాసు. వీరు రాసక్రీడలు, నారాయణతీర్థులతరంగములు, జయదేవునిఅష్టపదులను నేర్చుకొని ఎక్కడ ఉత్సవములు జరిగినను పాల్గొని పేరొoదినవారు.

బలరామమూర్తిగారు గొప్ప శివ భక్తుడు. ప్రతిదినము పార్థివలింగపూజ, అభిషేకమును చేయనిదే ఏ ఆహారము స్వీకరిoపని వ్యక్తి. హస్తవాసి గల గొప్ప ఆయుర్వేద వైద్యుడు. వీరిద్దరును మా తండ్రి తో కలిసి అనేక నాటకములలో వివిధ పాత్రలను ధరించి మెప్పు పొందిన వారే.

మా తాత బంగారయ్య మా పితామహి పిచ్చమ్మ. మా తాత గారు నృత్య గానములలో అసమానుడు. కావడి లో దేవతార్చనను ఉంచుకొని ఏ ప్రయాణ సౌకర్యములును లేని ఆ కాలము లో కాశీకి నడిచి వెళ్లి వచ్చి సన్యాసాశ్రమమును స్వీకరించి బ్రహ్మకైవల్యమొందిన మహాభక్తుడు. ఆయన దయ వలననే మా పితరులనుండి సంగీత విద్య వేదాంత విద్య మాకునూ కొంతవరకు లభ్యమైనవి. మా తాత తండ్రులనాటినుండి మా ఇంట శివ, రామ, కృష్ణ ఉత్సవములు జరిగేవి. భజనలు, పాట కచ్చేరీలు, ఉపన్యాసాలు జరిగేవి. త్యాగరాజ ఉత్సవములు ఐదురోజులు ప్రప్రధమమున మా ఇంటనే ప్రారంభమయినవి. ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమములలో పాల్గొని తాము పేరు తెచ్చుకొని నెల్లూరు పట్టణమునకు కీర్తి తెచ్చిపెట్టిరి. ఇందులో పాల్గొన్న కళాకారులు మద్రాసు మున్నగు పట్టణములనుండి వచ్చినను ఎవరి ఖర్చులు వారే భరించెడివారు.

కొందరు పురప్రముఖులు, నటకులు, శ్రీమంతులు మా తండ్రిగారి శిష్యులు, దాతలు, తమ సహాయ సహకారములను మా తండ్రికి అందించినoదున ఈ ఉత్సవ కార్యక్రమనిర్వహణకై ఒక భజన మందిరము ఏర్పడినది. శివరామకృష్ణ భజన మందిరముగా పేరొందినది. ఈ భజనమందిరము నెల్లూరు కలెక్టర్ ఆఫీసుకు ఎదురుగానుండెడి రాయాజీవీధిలో నేటికినీ స్థిరమై నిలిచి ఆధ్యాత్మిక కార్యక్రమములు జరుగుచున్నవి.

ఈ భజన మందిర ప్రారంభమునకు శ్రీ వాసుదాసు గారిని మా తండ్రి గారు ఆహ్వానించిరి. దాసుగారు మూడు రోజులు ఈ మందిరమున ఉపన్యాసములు ఇచ్చి దగ్గరుండి పూజాదికములను నిర్వహిoపజేసిరి.

ఈ మందిరములో శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, శంకరజయంతి, త్యాగారాజ ఉత్సవములు, సంప్రదాయబద్ధముగా జరిగేవి. తర్వాత దాసుగారి సలహాలతో పోతన జయంతి, హనుమజ్జయంతి ప్రతి శనివారము, ప్రతి ఏకాదశి, పర్వదినమలందును భజనలు, హరికథలు, ఉపన్యాసములు జరిగి నెల్లూరు పౌరులను తన్మయులను చేసెడి అవకాశము కలిగినది.

శ్రీవాసుదాసు గారు ఈ ఊరి అల్లుడు. రంగానాయకులపేట వారి ఆడపడుచు పూజ్యశ్రీ, మాతృశ్రీ శ్రీమతి రంగనాయకమ్మగారు దాసుగారి ధర్మ పత్ని. వీరి ప్రోత్సాహ, ఆశీర్బలముల వలననే మందిర ప్రతిష్ట ఇనుమడించెను.

ఇచ్చటిభజనలలో స్త్రీల భక్తిగేయములు, సంకీర్తనలు, మంగళహారతిపాటలు, పవళింపుసేవల పాటలు, ఏకాంతసేవా కార్యక్రమములు నృత్య గానములతో జరిగెడివి. స్త్రీ పురుషలందరునూ భక్తిప్రపత్తులతో మెలగుచూ ప్రతి క్షణము దాసుగారిని స్మరిoచుచూ సుప్రభాత సేవ నుండి పవళింపుసేవ వరకు పాల్గొని తాదాత్మ్యతను పొందెడివారు. బాల్యమున చూచిన ఆ సన్నివేశములు ఈ నాటికిని స్థిరములై మనఃఫలకమున మాకు నాటుకొని ఉన్నవి.

శ్రీరామాయణమునుండియు,దాసుగారి ఇతర గ్రంథములను గమనిoచినప్పుడును దాసుగారికి గల సంగీత విద్యాప్రావీణ్యమూ, అనేక వాద్యముల తోటి పరిచయము, వైద్యము, జ్యోతిషము కవితారచనాశైలి, సంఖ్యాశాస్త్రము, వేదఉపనిషత్ జ్ఞానము, అష్టాదశపురాణ, ఉపపురాణములలో ఆయనకున్న ప్రతిభాపాoడిత్యములు అనన్యములు. వ్యావహారిక విషయములను, ధర్మమునకు ఆటంకము లేక ప్రాచీన సంప్రదాయములను, జోడించి జీవితమును ఏ విధముగా గడుపవలెనో తెలియజేసెడి అoశములను మనము గమనిoచినచో ఆయా విద్యలయందు దాసుగారికి గల కూలంకష ప్రజ్ఞాప్రాభవములను గుర్తించి నమస్కరింపగలము.

చాల విషయములలో ఇదివరలో కొందరు చేసిన వీపరీత వ్యాఖ్యలను ఈనాటికినీ కొందరు మానుకొనక అసంబద్ధప్రలాపములు చేయుచుండగా దాసుగారు అనేక విషయములను సప్రమాణముగా రూఢిగా వారినడ్డుకొని వారి అధర్మ విజృoభణమును ఆపివేయగలిగిరి.

“విశ్వ శ్శ్రేయః కావ్యం” అని నన్నయగారి సూక్తి. లోకకళ్యాణంకొరకు ఉపయోగపడని ఏ గ్రంథమైననూ నిరుపయోగమై సమాజశ్రేయస్సును పాడు చేసి విపరీతపరిణామములకు దారి తీయగలదు. కనుక దాసుగారు తాను రచించిన అన్ని గ్రంథములను లోకోపకారార్ధమే రచించి జాతి, మత, వయో, వర్ణ, విభేదములు లేక అందరునూ ఉపయోగించుకొనునట్లు చేసిన మహాభక్తుడు. వారి సమకాలమున కొంచెము ఇంచుమించు అటుఇటుగానున్న మనము ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యఫలమేమో కదా! తన రచనలను ఒంటిమిట్ట కోదండరామస్వామికే అంకితమిచ్చి తన జీవితమును రామసేవకై అర్పించిన మహాయోగి, త్యాగి, భక్తుడు, శ్రీవాసుదాసుగారు. భక్తిసామ్రాజ్యమును రాముడు పాలించునట్లు చేసి దాసులుగా నిలిచి మనలను తరిoపజేసి వారు తరించిరి. వారే భద్రాచల రామదాసు- ఒంటిమిట్ట రామదాసు.

శ్రీవాసుదాసుగారి వాఙ్మయములోని కొన్ని విశేషాలు
భగవంతుడు ఎవరు? ఎట్లు ఆరాధిoపవలెను? ఎప్పుడు చేయవలెను? ఎవరు చేయవలెను?

విధిగా చేయవలసిన కాలనిర్ణయము సమయములేనప్పుడు లఘువుగా చేయవలసిన పద్ధతి ఎట్లుoడవలెను? మున్నగు విషయములలో ఎవరికి తోచినట్లు వారు నిర్ణయించుకొని తాము చేసేదే ధర్మమని చెప్పుచు తమతమకు అనుకూలములగు పద్ధతులలో మెలగుచు తాము భ్రష్టులయి ఇతరులను భ్రష్టుపట్టించేవారిని హెచ్చరించుటకై భగవదారాధన అను పేరు తో ఒక గ్రంథమునే దాసుగారు వ్రాసిరి. అనేక ప్రమాణములతో ధర్మనిర్ణయం చేసిన పద్ధతిని మనము గమనించి ఆచరంచినచో అందరము దైవకృపను పొందువారమే అగుదుము కదా!

ఇట్టి సందేహములు ఏ విషయములలో గాని ఎప్పుడు కలిగినను అనుభవజ్ఞులైన పెద్దలను అడిగి తెలిసికొని ఆచరించుట మేలు; లేదా భగవద్గీత 16వ అధ్యాయములో చెప్పినట్లు మెలగవలెను.

“ తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి.”
“ యఃశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్”


తాత్పర్యం: కార్య, అకార్యనిర్ణయమునందు అనగా ఏ పనిని ఎట్లు చేయవలెను? ఎట్లు చేయకూడదు? అను నిర్ణయమునందు శాస్త్రమే ప్రమాణము. శాస్త్రమనగా శాసించునది. ఆ ప్రమాణమును గ్రహించి శాస్త్రవిధిచే నియతకర్మలను చేసి యోగ్యుడవుకమ్ము.

ఎవడు శాస్త్రవిధిని నిర్లక్ష్యముచేసి విడిచిపెట్టి తన ఇష్టానుసారముగా నడచుకొనునో వానికి ఈ లోకమునందు సుఖము లేదు. పరలోకములో పుణ్యగతులు లేవు అని కృష్ణుడు అర్జునునకు నొక్కి చెప్పెను. దాసుగారు మనకు ఆ కర్మ మార్గమును ధర్మపధ్ధతిలోనే కృష్ణుడు సూచించినట్లు మనకునూ సూచించెను. ఇహపరముల రెంటికినీ దూరముగాక కృతార్ధతనొoదునట్లు దాసుగారు మన నడవడికను సరిదిద్దుకొనునట్లు చేయగలిగిరి.

సంధ్యావందన క్రియ

సంధ్యావoదనమనగానేమి? ఎవరు ఎట్లు చేయవలెను? రామాయణంలో వాలి, సీత, రామాదులు, ఋషులు, రాక్షసులు, మున్నగు వారందరును సంధ్యను ఉపాసించినట్లు చెప్పబడి ఉన్నది. దాసుగారు దీని వివరణమును పుస్తకముగా వ్రాసిరి. దీనిని నిదానముగా పూర్తిగా చదివినచో కర్మనెట్లు చేయవలెను? ఎందుకు చేయవలెను? ఎప్పుడు చేయవలెను? దాని వల్ల లాభమేమి? అను విషయములు వివరిoపబడినవవి. తప్పక కర్మమార్గమును తెలిసిచేయవలెను. కర్మ చేయుట గొప్ప కాదు. కానీ దానిని ఎట్లు చేయవలెను? ఎందుకు చేయవలెనో తెలిసి చేయుట, దాని విధిక్రమములను పాటించుట ముఖ్యావసరమని దాసుగారు పలుమార్లు మనలను హెచ్చరించెను. దీనివలన కర్మమార్గము చక్కగా తెలిసి దాని వలన ధ్యానము కుదిరి భక్తిమార్గమున పయనించి పిదప జ్ఞానమార్గమును ఆధారము చేసికొని జన్మరాహిత్యము పొందుట జరుగునని గీతలోని 18 అధ్యాయముల సారాంశము వాసుదాసుగారు సులభ శైలి లో మనకు సూచిoచిరి.

పూజావిషయమున పూలు, దర్భలు, తులసి, మున్నగు పూజాద్రవ్యములు ఎట్లుండవలయును? వాని పవిత్రత ఎంతకాలముండును? పూజాద్రవ్యములలో పనికి వచ్చునవి ఏవి? పనికిరానివి ఏవి? ఇట్టి విషయములను అనేక గ్రంథములను ఆధారముగా చేసికొని మనవిధిని దాసుగారు సూచించారు.

ఆకాశమందలి నక్షత్రములను లెక్కించుట సాధ్యము కాదు. అట్లే దాసు గారు మనకు చెప్పిన ధర్మసూక్ష్మములను కూడ లెక్కింపలేము సాధ్యమైన ధర్మములను ఎంత వరకు ఎట్లు పాటింప వచ్చునో, అందువలన వచ్చు లాభనష్టములు ఎట్టివో అనుధర్మాధర్మ నిర్ణయచర్చ కూడా జరిపి పుస్తక రూపములలో మనకందించిన మహనీయుడు.

భక్తిసంజీవని అనే పత్రికను నడిపి అనేక వ్యాసములను వివిధ కోణములలో ఇతరులచే వ్రాయించి, తానును వ్రాసి వాని ద్వారా మానవకోటికి అధ్యాత్మికస్థితిని కలిగించి మనలను దాసుగారు మోక్షకాములనుగా చేసినారు.

యోగవిద్యనుగూర్చి నేడు అందరును బోధించేవారే. ఆ విద్యాభ్యాసము వలన ఉపయోగములు ఎట్టివి? మిధ్యాచారులు కపటవర్తనులు ఎట్లు ప్రవర్తించి మన పతనమునకు ప్రయత్నింతురో, మనము ఎంత జాగ్రత్త పడవలెనో దాసుగారు మనలను హెచ్చరించిరి.

ఆత్మ- అనాత్మల విషయములను చర్చారూపముగా నిర్వహించి మనము పొరపాటులను పొందే చోట్లు, విధిగా సరిదిద్దుకొనవలసిన ఆవశ్యకత, ఆచరించే అవసర విధానము బాలురకు కూడ చక్కని అవగాహన కలిగించి పాటించునట్లు ఉత్సాహమును కలిగించే గ్రంథమై ఉన్నది. బాలురనగా గ్రహణ, ధారణ, పటుర్బాలః అని అర్ధము. అనగా చెప్పిన ధర్మ విషయములను విని, గ్రహించి అనుమానములను నివృత్తి చేసికొని ధారణలో ఉంచుకొని ఆచరించే వాడే బాలుడు.

కుమార(బాలక) హిత చర్య
కుమారీ హిత చర్య
పతి హిత చర్య
సతీ హిత చర్య
గర్భిణీ హిత చర్య
ముముక్షు హిత చర్య

అను పేర్లతో చాల పుస్తకములను వ్రాసి ప్రాథమిక విద్యాభ్యాస దశనుండి చివరి దశ వరకు ఎవరెవరు ఎట్లెట్లు మెలగవలెనో పలుమారు నొక్కి చెప్పెను. వీని లోని చాల విషయములు సులభతరములే. మా బాల్యములో తరగతులను బట్టి ఈ పుస్తక పరిచయము జరిగేది. అందలి ముఖ్య విషయములను కంఠస్థము చేయించి ప్రార్ధనా సమయములలోను, బడి జరిగే వేళలలోనే కాళీగా ఉండే సమయములలో మాచే కొన్ని సూక్తులను చెప్పిస్తూ వానిని ఉపాధ్యాయులు వివరించెడివారు. నీతికథలు(Moral Instructions) అని ఒక period కూడా ఉండేది. ఇప్పుడు వానినిగూర్చి మనస్సులో అనుకొనుట కూడా నిష్ఫలము. Syllabus లో పఠిoపవలిసిన పాఠముల వరుసలో గాని, వయసుకు తగిన విద్యాభ్యాస వాతావరణములో గానీ చెప్పెడి వారు లేరు. వినువారు కూడా లేరు.అధికారులు పైఅధికారుల మెప్పుకై ఊకదంపుడు ఉపన్యాసములనిచ్చి నేటి నీచస్థితికి మొసలి కన్నీరు కార్చేవారే కానీ ఎవ్వరు కూడ ఏ ప్రయత్నమునూ చేయుట లేదు. “యత్నే కృతే యది న సిద్ధ్యతి- కో2త్ర దోషః అనగా ప్రయత్నించి ఒక పనిని చేయుచున్నప్పుడు అది ఫలిoపనిచో దోషము లేదు. అసలు ప్రయత్నమే లేకుంటే ఫలితము సున్నయే కదా! అందరు వాచా వేదాoతులేగానీ ఆచరణ వేదాంతులు కాలేకున్నారు.

వాసుదాసుగారు తాటిచెట్టునుగూర్చి కూడ ఒక శతకం వ్రాసిరి. కాగితముగా పుట్టుటకు ముందు వాఙ్మయమoతయూ గంటముతో వ్రాయబడిన( నేటి పేనాలు పెన్సిళ్ళు ఉన్నట్లు వ్రాయు సాధనము.) తాటి ఆకులపై పెద్దలు వ్రాసెడివారు. తాటిచెట్టు, కొబ్బరిచెట్టు, అరటిచెట్టు, మున్నగు వానిని కల్పవృక్షములుగా వారు భావించేవారు. పై వృక్షములలోని ఏ భాగమైనను మనకు ఉపయోగపడునదే కనుక కల్పవృక్షము అన్నారు.

స్త్రీల చెవులకు తాటాకులనే ఆభరణములగా ఉపయోగించేవారు. దీనిని కమ్మ అని పిలిచేవారు. ముత్తైదువ శుభలక్షణములలో ఒక దానినిగా దీనిని చేర్చిరి కూడ. ఒక చోటి నుండి మరొక చోటికి వార్తలను పంపే జాబులను కూడ కొందరు కమ్మ అని పిలుతురు. కనుక వాఙ్మయమునగాని, వ్యవహారమున గాని తాటిఆకుకున్న విలువ దేనికినీ లేనందున సరస్వతీదేవిని పూజించినట్లే అగునని ఈ శతకమును రచించినట్లు ఊహిoపవలయును.

బమ్మెర పోతన ఏకశిలానగరవాసి. ఏకశిల అనగా ఒంటిమిట్ట. పోతన తన భాగవతరచనమును ఇచ్చటనే సాగించి ఈ కోదండరామస్వామికే అoకితమిచ్చెను. కొందరు ఒంటిమిట్ట అనగా నేటి వరంగల్ ప్రాంతమును సూచించుచున్నారు. ఈ వాదోపవాదములను అటు ఉంచి వాసుదాసుగారు బమ్మెర పోతరాజ విజయము అని ఒక గ్రంథమునే వ్రాసి ఒంటిమిట్టనే ఏకశిలానగరమని నిర్ధారించిరి.

ఇచ్చటి కోదండరామ ఆలయ ప్రధాన గోపురము కొంత శిథిలమగుటను వాసుదాసుగారు గమనించి చూచి ఎవరికినీ ఏ ప్రమాదము కలుగకుoడుటకై ఇనుప కడ్డీలను పోటీగా నిలిపి గోపురమునకు స్థిరతను కల్పించి భక్తరక్షణ చేయగలిగిరి. దాసుగారి దూరదృష్టిని ప్రశంసింపక తప్పదు కదా.

దాసుగారు రామాలయమునకు ఇంచుమించు ఎదురుగా ఉన్న కొండ పై కూర్చొని ఈ రచనలను సాగించెడి వారు. ఆ గుర్తుగా కొండ పై కాలక్రమమున దాసుగారి విగ్రహము ఏర్పడినది. ఇప్పటికిని తిరుమలలో వరాహస్వామిని చూడనిదే శ్రీవేoకటేశ్వరుని భక్తులు దర్శింపరు. అట్లే కొండపై నున్న దాసుగారిని దర్శింపనిదే కోదండరామస్వామిని దర్శింపరు.

రామాలయములో ఇప్పటికిని పోతన విగ్రహము, దాని క్రింద “ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి” అను పద్యము గల శిలాశాసనము ఉన్నది. కనుక ఎంత కాలమైనను దాసుగారు చేసిన రామసేవ శాశ్వతమై నిలిచి ఉన్నది.

వాసుదాసుగారి శిష్యులై ఇప్పటికిని శ్రమించుచున్న ఎందరో భక్తులలో శ్రీలక్ష్మీనారాయణరెడ్డిగారు ప్రముఖులై ఉన్నారు. వీరుగనక గట్టి ప్రయత్నముతో పూనుకొననిచో దాసుగారి వాఙ్మయము మరుగున పడిపోయేదే.”నిరాశ్రయా నశోభoతే పండితా వనితా లతా”- పెద్దల ఆశ్రయములేనిదే కవి పండితుల ప్రతిభ, స్త్రీలు, తీగెలు ప్రకాశిoపవు. ఆ నాటి కవి పండితులు రాజాశ్రయముతో తమతమ రచనాప్రతిభను ప్రకాశింపజేసిరి.

అట్లే స్త్రీలు కూడ భర్త మున్నగువారి ఆశ్రయము లేనిదే అపకీర్తి పాలగుదురు. ఏ చెట్టుతీగ గాని మరొక చెట్టునో లేదా స్తంభమునో ఇట్లు ఏదొక ఆశ్రయము లేనిదే శోభింపదు. ఆ నాటి కవులు పండితులు ఎంత నిష్కామబుద్ధితో భక్తితో గ్రంథములు రచించిననూ వారి పేర్లు వారి రచనలు కొన్నితెలియబడకున్నవి. అట్లే దాసుగారి రచనలు ఇతరులకు ఉపయోగపడనిదే లోకకళ్యాణము జరగదని రెడ్డిగారు భావించి చాల దూరదృష్టితో తన కాలమును ధనమును ఎంతో వెచ్చించి గుర్తింపజేసిరి. అందువలననే దాసుగారి రచనలు ఎవరికి ఏది కావలెనో వారికది అoదునట్లు Internet సౌకర్యమునుకూడ కల్పించిరి. దీనివలన దాసుగారి శ్రమ, వాఙ్మయసేవ, వాల్మీకాది మహర్షుల అంతరంగము స్పష్టమై కొన్నిటినైన తెలిసి ఆచరించే అవకాశము అదృష్టవశమున మనకు లభించినది.

సంఘమున మానవులు ఎట్లుoడవలెను? తల్లిదండ్రులను ఎట్లు గౌరవింపవలెను? సంతానమును సన్మార్గమున నడిపించి చక్కని పౌరులనుగా తీర్చిదిద్దుటలో వారికెట్టి బాధ్యత ఉన్నది? భార్యాభర్తలు ఎట్లుండవలెను? ఆదర్శ దంపతులై వారు మెలగవలసిన తీరు ఎటువంటిది? సమాజమున స్త్రీపురుషులు ఒకరికొకరు ఎట్లు మెలగి సంఘశ్రేయస్సుకై పాటుపడవలెను? మున్నగు అనేక విషయములనుగూర్చి చేసిన దాసుగారి రచనలు ఎంత ప్రయత్నించినను దొరకకుండుటచే వానిని రెడ్డిగారు ఎన్నెన్నో శ్రమలకోర్చి సంపాదించి మరల వానిని క్రొత్తగా ముద్రించి ఈ కాలమున కూడా ఆ గ్రంథములు ఎంత గొప్పవో నిరూపించి అందరును చదివే ఉత్సాహమును కల్పించిరి. ఆ రచనలను అందజేయుట అందరికిని సాధ్యమగుననదికాదు. అట్టి క్లిష్టతర పరిస్థితిని ఎదుర్కొని ధీరుడైనిలిచి తన జీవితమును దాసుగారికే అంకితము చేసికొనుచున్నారు. వీరి కృషికి వీరి ధర్మపత్ని సహాయసహకారములుకూడ మరువలేనివై ఉన్నవి. భక్తిసంజీవని పత్రికలను కూడ మొదటినుండి చివరివరకు అన్నిటినీ సంపాదించి సంపుటములుగా అoదిoచినారు.

నేనును దాసుగారి విగ్రహము కొంత శిథిలమై ఉండగా పునఃప్రతిష్టాకార్యక్రమములో పాల్గొని ఉంటిని. రెడ్డిగారి ప్రోత్సాహబలము వలననే ఆ కార్యక్రమమేగాక శ్రీరామకుటీరమoదు ఏర్పాటుచేసిన కొన్ని కార్యక్రమములలో కోదండరాముని సన్నిధి యoదు సంజీవరాయని( అంజనేయస్వామి) అనుగ్రహబలమున పాల్గొని దాసుగారి సేవాకార్యక్రమములనుగూర్చి ప్రవచనములను చేసెడిఅదృష్టముకూడ కలుగుట మా తల్లిదండ్రులు, వాసుదాసుగారి ఆశీస్సులు రెడ్డిగారు నాయందు చూపిన గౌరవాదరములు కారణములై నేను కూడా తరించెడి అవకాశము ఈ జన్మలో కలుగుట శ్రీరామానుగ్రహబలమే.

భగవత్ కృప తో తన కష్టములన్నింటినీ భరించి తన రచనల ద్వారా మనలను ఉద్ధరిoచుచు తన కృషిని చిరస్థాయిగా నిలిపిన భక్తశిరోమణి ఆంధ్రవాల్మీకి శ్రీవాసుదాసుగారు.

ఇట్లు,
బుధజనవిధేయుడు
(భాషాప్రవీణ) నేలనూతల శ్రీనివాసమూర్తి
రిటైర్డ్ తెలుగు పండిట్
(ఆంధ్రప్రదేశ్ప్రభుత్వఉత్తమఉపాధ్యాయఅవార్డుగ్రహీత-1992)
అడ్రస్ :
నేలనూతల శ్రీనివాసమూర్తి
20/801- NSK కాంప్లెక్స్
అలంకార్ సెంటర్
బ్రాహ్మణ వీధి
మూలపేట- నెల్లూరు(A.P.) 524003
Ph.no. 9963675999
oskumar45@gmail.com
Free Global Counter